ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు 4 వేల మందికి పైగా ఆహ్వానం!

  • రేపు దేశ స్వాతంత్ర్య దినోత్సవం
  • ఢిల్లీలో ఊపందుకున్న ఏర్పాట్లు
  • కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు
రేపు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జరిగే వేడుకకు 4 వేల మందికి పైగా హాజరు కానున్నారు. ప్రభుత్వ పెద్దలు, కీలక రంగాల ప్రముఖులు, దౌత్యవేత్తలు, అధికారులు, మీడియా ప్రతినిధులను ఈ సంబరానికి ఆహ్వానించారు. దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఈ వేడుక ప్రతిష్ఠకు ఏమాత్రం భంగం కలగని రీతిలో, మరోవైపు కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సమతౌల్యంతో కూడిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. ఇద్దరు అతిథుల మధ్య రెండు గజాల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. అంతేకాదు, గౌరవ వందనం సమర్పించే సిబ్బందిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉంచామని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

గతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పాఠశాలల విద్యార్థులను ఆహ్వానించేవారమని, ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్సీసీ కేడెట్లను పిలిచామని రక్షణశాఖ తెలిపింది. మాస్కులు ధరించడం తప్పనిసరి చేశామని, ఎర్రకోట వద్ద కూడా పెద్ద సంఖ్యలో మాస్కులను పంపిణీకి సిద్ధంగా ఉంచామని వివరించింది. నిర్దేశించిన ప్రాంతాల్లో శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నామని, అన్ని ప్రవేశద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశామని వెల్లడించింది.


More Telugu News