అమెరికాలో ఇలా చేస్తేనే... 80 వేల కరోనా కేసులొచ్చాయి: సోము వీర్రాజు

  • దశల వారీగా విద్యాసంస్థలు ప్రారంభించాలని ఏపీ సర్కారుకు హితవు
  • ఒకేసారి ప్రారంభిస్తే కరోనా వ్యాప్తి అధికమవుతుందని వెల్లడి
  • ప్రజా రవాణా వ్యవస్థ లేకుండా విద్యార్థులెలా వస్తారన్న సోము
ఏపీలో విద్యాసంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ తీవ్రమవుతున్న తరుణంలో ఒకేసారి కాలేజీలు, పాఠశాలలు ప్రారంభించడం వల్ల సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. అన్ని విద్యాసంస్థలు ఒకేసారి ప్రారంభిస్తే పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలుస్తారని, దాంతో కరోనా వ్యాప్తి మరింత అధికమవుతుందని, విద్యార్థుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా విస్తరించే ప్రమాదం ఉందని సోము వీర్రాజు ఆందోళన వెలిబుచ్చారు.

అందుకే అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాతే విద్యాసంస్థలు దశలవారీగా తెరవాలని సూచించారు. ముందుగా కాలేజీలు, ఆ తర్వాత జూనియర్ కళాశాలలు, ఆపై పాఠశాలలు విడతల వారీగా ప్రారంభించాలని తెలిపారు. అమెరికాలో ఒకేసారి విద్యాసంస్థలు ప్రారంభించడం వల్ల 80 వేల మందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. అంతేగాకుండా, ప్రజా రవాణా వ్యవస్థలపై ఆధారపడి 60 శాతం మంది విద్యార్థులు విద్యాసంస్థలకు వస్తుంటారని, బస్సులు ప్రారంభించకుండా వాళ్లు విద్యాసంస్థలకు ఎలా వస్తారని ప్రశ్నించారు.


More Telugu News