39 మంది విదేశీ చిన్నారులకు సినీనటుడు సోను సూద్‌ సాయం

  • ఫిలిప్పీన్స్‌ నుంచి రానున్న 39 మంది చిన్నారులు
  • న్యూఢిల్లీలో వారికి వైద్యం
  • కాలేయ మార్పిడి చికిత్సకు ఇప్పటికే ఏర్పాట్లు
  • వారికి విమాన ప్రయాణ సౌకర్యం కల్పించనున్న సోను
కరోనా సంక్షోభ సమయంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన కూలీలు తమ సొంత గ్రామాలకు చేరడానికి సాయం చేసిన సినీనటుడు సోను సూద్ తన సేవా కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌ లో ఉన్న భారతీయులు కరోనా వేళ స్వదేశానికి రావడానికి సాయం చేసిన సోను సూద్.. ఇప్పుడు ఆ దేశంలోని చిన్నారులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
 
ఫిలిప్పీన్స్‌ నుంచి 39 మంది చిన్నారులు న్యూఢిల్లీకి వచ్చి వైద్యం చేయించుకోవాల్సి ఉంది. వారి విమాన ప్రయాణానికి సోను సూద్‌ సాయం ప్రకటించారు. ఆ చిన్నారులకు న్యూఢిల్లీలో కాలేయ మార్పిడి చికిత్స చేయించడానికి ఇప్పటికే ఓ సంస్థ ముందుకు వచ్చింది.

అయితే, కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ చిన్నారుల విమాన ప్రయాణం ఆగిపోయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న సోను సూద్‌ ఆ చిన్నారులను రెండు రోజుల్లో భారత్‌కు వచ్చేలా సాయం చేస్తానని ట్వీట్‌ చేశారు.

ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ చిన్నారులు అందదూ 1 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారే. వీరందరూ బైలరీ అట్రీసియా అనే కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. వారంతా న్యూఢిల్లీకి రావడానికి విమాన ప్రయాణ సదుపాయం కల్పించి వారి ప్రాణాలను సోను సూద్ కాపాడనున్నారు.


More Telugu News