సినిమా హాళ్లు తెరచినా... వారాంతంలో మాత్రమే కలెక్షన్లు: అల్లు అరవింద్

  • సినీ పరిశ్రమను మార్చేసిన లాక్ డౌన్
  • థియేటర్లు తెరచుకున్నా ఓటీటీని వదలబోరు
  • రెండూ సమాంతరంగా సాగుతాయన్న అరవింద్
కరోనా వైరస్, లాక్ డౌన్ సినీ పరిశ్రమను పూర్తిగా మార్చేశాయని, ఓటీటీల వినియోగం గణనీయంగా పెరిగిందని, సినిమా హాళ్లు తిరిగి ప్రారంభించినా, ప్రజలు సినిమాలు చూసేందుకు వచ్చే పరిస్థితి లేదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. కేవలం వారాంతాల్లో మాత్రమే ప్రజలు థియేటర్లకు వస్తారని, మిగతా రోజుల్లో ఓటీటీలు, టీవీ చానెళ్లను వినోదం కోసం ఆశ్రయిస్తారని అభిప్రాయపడ్డారు.

'ఆహా' యాప్ అభివృద్ధి ప్రణాళికలు, దానిలో విడుదల కానున్న సినిమాల విశేషాలను మీడియాకు వివరించేందుకు ఓ సమావేశాన్ని నిర్వహించిన ఆయన, థియేటర్లపై ఓటీటీ చూపనున్న ప్రభావంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ యాప్ నకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటికే 40 లక్షలకు పైగా డౌన్ లోడ్లు వచ్చాయని వెల్లడించిన అరవింద్, ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలు, స్పెషల్ షోలను విడుదల చేయనున్నామని అన్నారు.

సినీ ప్రేక్షకులకు ఓటీటీ దగ్గరై పోయిందని, దానిలోని కంటెంట్ ను ఆస్వాదిస్తున్న వారు, సినిమా హాళ్లు తెరచుకున్నా, ఓటీటీని పక్కన పెడతారని భావించడం లేదని అన్నారు. మూవీ థియేటర్లు, ఓటీటీలు సమాంతరంగా సాగుతాయని అభిప్రాయపడ్డారు. ఓ సినీ నిర్మాతగా తాను ఓటీటీని వీడబోనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.


More Telugu News