దొరలపాలనకు 2023లో చరమగీతం.. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం నేనే: మంద కృష్ణమాదిగ

  • ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే కేసీఆర్‌పై యుద్ధం
  • పేదల భూములను రాబందుల్లా పీక్కు తింటున్నారు
  • వరంగల్‌ను శాసన రాజధానిగా చేస్తాం
తెలంగాణలో 2023లో దొరల పాలనకు చరమగీతం పాడి రాజ్యాధికారాన్ని సాధిస్తామని మహాజన సోషలిస్ట్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. నిన్న హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు మరో మూడేళ్లు ఉండగానే కేసీఆర్ దొరల పాలనపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. పేదల ప్రాణాలను గాలికి వదిలి, పేదల భూములను రాబందుల్లా పీక్కుతింటున్నారని ఆరోపించారు.

దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ 2018 నాటికి ఆ ఊసే మర్చిపోయారని ఆరోపించారు. హామీ నిలబెట్టుకోకపోవడమే కాకుండా పేదల నుంచి ఇప్పటి వరకు లక్ష ఎకరాల భూమిని లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో దొరల పాలనకు స్వస్తి చెప్పి వరంగల్‌ను శాసన రాజధానిగా చేసుకుని అద్భుత పాలనకు శ్రీకారం చుడతామని మందకృష్ణ తెలిపారు. కాగా, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా హన్మకొండకు చెందిన తీగల ప్రదీప్‌గౌడ్‌ను మంద కృష్ణ ప్రకటించారు.


More Telugu News