పెండింగ్ లో ఉన్న బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

  • భారత్ లో మార్చి 31తో బీఎస్ వాహన విక్రయాలు నిలిపివేత
  • లాక్ డౌన్ కారణంగా ప్రత్యేక అనుమతి ఇచ్చిన సుప్రీం
  • పెండింగ్ లో వేల సంఖ్యలో వాహనాలు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆటోమొబైల్ డీలర్లకు శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. మార్చిలో విక్రయించినా, ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కు నోచుకోని బీఎస్4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని న్యాయస్థానం వెల్లడించింది. మార్చి 12 నుంచి మార్చి 31 మధ్య కాలంలో దేశంలో 9,56,015 వాహనాలు అమ్ముడవగా, వాటిలో రిజిస్ట్రేషన్ పూర్తయినవి 9,01,223 మాత్రమే.

కేంద్రం సరికొత్త బీఎస్6 ఉద్గార ప్రమాణాలు అమలు చేయాలని సంకల్పించడంతో బీఎస్4 వాహనాల అమ్మకాలను మార్చి 31తో నిలిపివేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో తాము బీఎస్4 వాహనాలను విక్రయించలేకపోయామని, తమ వద్ద మిగిలివున్న వాహనాలను అమ్ముకునేందుకు అనుమతించాలని ఆటోమొబైల్ వర్గాలు సుప్రీంను ఆశ్రయించాయి. దాంతో 10 రోజుల్లో 10 శాతం వాహనాలు మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది.

కానీ, ఆటోమొబైల్ డీలర్లు ఆ కాస్త గడువులో 10 శాతం కంటే మించి వాహనాలు విక్రయించడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగా బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్ ముందుకు కదల్లేదు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఆటోమొబైల్ డీలర్లకు ఊరట కలగనుంది.


More Telugu News