విభజన అంశాలపై హైకోర్టులో విచారణ... అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

  • రాజధానిపై నిర్ణయాధికారం తమదేనన్న సర్కారు
  • కేంద్రం కూడా ఇదే విషయం చెప్పిందని వివరణ
  • పిటిషన్ లోని అంశాలు సమీక్షార్హం కాదని స్పష్టీకరణ
రాష్ట్ర విభజన అంశాలపై పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని వైసీపీ సర్కారు తన అఫిడవిట్లో స్పష్టం చేసింది. కేంద్రం కూడా తమ అఫిడవిట్లో ఇదే విషయం స్పష్టం చేసిందని వెల్లడించింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు ఆమోదం పొందాయని, అందువల్ల పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు, కార్యాలయాల తరలింపుపై లేవనెత్తిన అంశాలు సమీక్షార్హం కాదని తెలిపింది.

అంతేకాదు, అభివృద్ధి ప్రణాళిక, వివిధ ప్రాజెక్టుల సమీక్షాధికారం రాష్ట్రానికి ఉందని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిందని వెల్లడించింది. ప్రత్యేక హోదా అంశం ఇప్పటివరకు అమలు కాలేదని వివరించింది. కేంద్రంతో జరిగే ప్రతి భేటీలోనూ హోదా గురించి అడుగుతున్నామని ప్రభుత్వం తన అఫిడవిట్ లో తెలిపింది. రాష్ట్ర విభజనలో ప్రత్యేక హోదా అనేది అంతర్భాగమని ఉద్ఘాటించింది. హోదా రానంతవరకు విభజన ప్రక్రియ అసంతృప్తికరంగానే ఉంటుందని పేర్కొంది.


More Telugu News