'జాంబీ రెడ్డి' సినిమా టైటిల్‌పై వివాదం.. స్పందించిన దర్శకుడు

  • మా సినిమా టైటిల్ పేరును 'జాంబీ రెడ్డి' అని ప్ర‌క‌టించాం
  • ట్విట్ట‌ర్‌లోనూ బాగా ట్రెండ్ అయ్యింది
  • సినిమాలో ఓ క‌మ్యూనిటీని త‌క్కువ చేసి చూపించ‌డం ఉండదు 
  • ఇదొక వినోదాత్మక సినిమా  
టాలీవుడ్‌లో  'అ!', 'క‌ల్కి' సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు  ప్రశాంత్ వర్మ ప్రస్తుతం  'జాంబీ రెడ్డి' అనే విభిన్న టైటిల్‌తో కొత్త సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లోగోను ఆయన తాజాగా రిలీజ్ చేశాడు. తెలుగులో ఇదే మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్. అయితే, ఈ సినిమాకు పెట్టిన టైటిల్‌పై వివాదం రాజుకుంది. ఒక సామాజిక వర్గం వారి మనోభావాలు దెబ్బతిన్నట్లు పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రశాంత్ వర్మ ఓ ప్రకటన విడుదల చేసి వివరణ ఇచ్చాడు.

ఇటీవ‌ల తమ సినిమాకు 'జాంబీ రెడ్డి' టైటిల్ని ప్ర‌క‌టించామని, దానికి మంచి స్పందన ‌వచ్చిందని చెప్పాడు. ట్విట్ట‌ర్‌లోనూ బాగా ట్రెండ్ అయ్యిందని అన్నాడు. ఈ పేరు చాలా బాగుందంటూ చాలా కాల్స్‌, మెసేజులు వ‌చ్చాయని చెప్పాడు. అయితే, కొంత‌మంది మాత్రం టైటిల్‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరించాడు. ఈ సినిమా ద్వారా ఎవ‌రినీ త‌క్కువ చేసి చూపించ‌డం, ప్ర‌త్యేకించి ఓ క‌మ్యూనిటీని త‌క్కువ చేసి చూపించ‌డం ఉండ‌దని ఆయన వివరించాడు.

ఇదొక వినోదాత్మక సినిమా అని, క‌రోనా చుట్టూ తిరుగుతూ, క‌ర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ ఇదని చెప్పాడు‌. క‌ర్నూలును ఈ క‌థ ఎంత హైలైట్ చేస్తుందో సినిమా చూస్తే తెలుస్తుందని చెప్పాడు. ద‌య‌చేసి టైటిల్‌ను త‌ప్పుగా ఊహించుకోవ‌ద్దని ఆయన కోరాడు. దీని ద్వారా ఏ కులాన్నీ త‌క్కువ‌చేసి చూపించ‌డం ఈ సినిమాలో ఉండ‌దన్నాడు.

                  


More Telugu News