మన రక్షణ శాఖ సామర్థ్యం ఎంత?: కీలక సమీక్ష నిర్వహించిన మోదీ

  • ఆయుధాలను దిగుమతి చేసుకోవద్దని కేంద్రానికి సిఫార్సు
  • దశలవారీగా నిర్ణయాన్ని అమలు చేసే ఉద్దేశంలో కేంద్రం
  • దేశవాళీ సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్న మోదీ
దేశవాళీ ఆయుధాలతో ఇండియాకున్న రక్షణ సామర్థ్యం ఏ మేరకు దేశాన్ని కాపాడుతుందన్న విషయమై ఆ శాఖ వర్గాలతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమీక్షలను నిర్వహించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై నిషేధాన్ని విధించాలని కేంద్రం భావిస్తున్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

కొన్ని రోజుల క్రితం సైనిక వ్యవహారాల శాఖ మొత్తం 101 వస్తువులను దిగుమతి జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో సబ్ మెరైన్లు, ఆర్టిలరీ గన్స్, అసాల్ట్ రైఫిల్స్ వంటి పలు రకాల ప్రొడక్టులు ఉన్నాయి. రానున్న రెండు నుంచి మూడేళ్లలో దశల వారీగా వీటిని దిగుమతుల జాబితా నుంచి తొలగించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోగా, అసలు భారత్ శక్తి సామర్థ్యాలు ఎంతన్న విషయాన్ని తెలుసుకోవాలని మోదీ భావిస్తున్నారని తెలుస్తోంది.

డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్, డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్), గడచిన పక్షం రోజులుగా, భారత ఆయుధ తయారీ నైపుణ్యాన్ని మధిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఆయుధ తయారీ రంగంలో భారత్ సాధించిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో ప్రధాని పలు విభాగాల అధికారులతో విడివిడిగా సమావేశాలను నిర్వహించారు. దేశవాళీ ఆయుధ తయారీ సామర్థ్యాన్ని అంచనా వేయడంతో పాటు, వివిధ రకాల ఆయుధాల తయారీ ప్రాజెక్టుల స్థితిగతులపైనా సమీక్ష జరిపారు.

ఈ సమావేశాల్లో డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. దిగుమతులను నిషేధించాలని నిర్ణయం తీసుకునే ముందు, ఈ నెల మే వరకూ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల వివరాలను, ఇండియాకు అవసరమైన ఆయుధాల్లో, ఇప్పటికీ స్వదేశీ తయారీ అభివృద్ధి చెందని ఆయుధాల వివరాలను ఆయన ప్రధానికి తెలియజేశారు. కరోనా కారణంగా లాక్ డౌన్ అమలైన మూడు నెలల వ్యవధిలో స్వదేశీ ఆయుధాల తయారీ ఎలా జరిగిందన్న సంగతిని కూడా ఆయనే ప్రధానికి వెల్లడించారు. ఆయుధాల దిగుమతి విషయంలో తొందరపడి నిర్ణయాలు వద్దని, దశలవారీగా తీసుకుందామని నరేంద్ర మోదీ సూచించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతానికి నిషేధిత రక్షణ శాఖ ఉత్పత్తుల జాబితాలో వాటర్ జెట్స్, సర్వే వెసెల్స్, పొల్యూషన్ కంట్రోల్ వెసెల్స్, లైట్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, జీశాట్-6 టర్మినల్స్, రాడార్లు, నిఘా విమానాలు, కొన్ని రకాల రైఫిల్స్, ఆర్టిలరీ గన్స్, బులెట్ ప్రూఫ్ జాకెట్లు, మిసైల్ డిస్ట్రాయర్లు ఉన్నాయని తెలుస్తోంది.


More Telugu News