రష్యా వ్యాక్సిన్ విషయంలో తొందరపడబోం: ఇజ్రాయెల్

  • రష్యా టీకా కోసం 20 దేశాల ఆసక్తి
  • కచ్చితమైనదని తేలితేనే కొనుగోలుకు చర్చలు జరుపుతామన్న ఇజ్రాయెల్
  • ఏ దేశం అభివృద్ధి చేసిందన్న దానితో తమకు సంబంధం లేదన్న ఆరోగ్య మంత్రి 
రష్యా ఆవిష్కరించిన కరోనా వ్యాక్సిన్ విషయంలో తాము తొందరపడబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకా కోసం దాదాపు 20 దేశాలు ఆసక్తి చూపిస్తున్న వేళ ఇజ్రాయెల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా టీకాపై ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి యులి ఎడెల్‌స్టైన్ మాట్లాడుతూ.. రష్యా వ్యాక్సిన్‌ను పరిశీలించి, అది కచ్చితమైనదేనని నిర్ధారణకు వచ్చిన తర్వాతే దానిని కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.

టీకాను ఎవరు అభివృద్ధి చేశారనే విషయంతో తమకు సంబంధం లేదని, ప్రతీ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కచ్చితమైనదని తేలితే కొనుగోలుకు ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. కాగా, కరోనాను ఎదుర్కొనే టీకా అభివృద్ధిలో ఇజ్రాయెల్ కూడా తలమునకలై ఉంది. అక్టోబరు నాటికి టీకాను అభివృద్ధి చేసి హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


More Telugu News