అమెరికా అనవసరమైన భయభ్రాంతులు సృష్టిస్తోంది: చైనా
- ఇటీవలే తైవాన్ లో పర్యటించిన అమెరికా ఆరోగ్య విభాగాధిపతి
- కరోనా అంశంలో చైనాపై విమర్శలు
- నిప్పుతో ఆడుకుంటే కాలుతుందని చైనా వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక చైనాతో అగ్రరాజ్యం సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇటీవలే అమెరికా ఆరోగ్య విభాగం అధిపతి అలెక్స్ అజర్ తైవాన్ లో పర్యటిస్తూ కరోనా నేపథ్యంలో చైనాను విమర్శించారు. దాంతో చైనా భగ్గుమంది. నిప్పుతో ఆడుకోవాలనుకోవడం సరికాదని హితవు పలికింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందిస్తూ, చైనాకు చెందిన వ్యవహారాల్లో అమెరికా అర్థంపర్థంలేని భయభ్రాంతులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఎవరికో బానిసలుగా ఉంటూ, స్వతంత్రం కోసం విదేశీయుల మద్దతుపై ఆధారపడితే అది ముగింపు అవుతుంది అంటూ పరోక్షంగా తైవాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.