సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రాజకీయ మలుపు తీసుకుంది: బీహార్ డీజీపీ

  • సుశాంత్ కేసును బీహార్ విచారించడంపై మహారాష్ట్ర గుస్సా
  • మహారాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు
  • కేసుతో నితీశ్ కు సంబంధం లేదన్న బీహార్ డీజీపీ
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణ కోసం బీహార్ పోలీసులు రంగంలోకి దిగినప్పటి నుంచి... పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ పోలీసులు విచారణ చేయడాన్ని ముంబై ప్రభుత్వం, పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివసేన నేతలతో పాటు, ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నా కూడా దీన్ని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో, బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ మరణం ఇప్పుడు రాజకీయ మలుపులు తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై ఆరోపణలు చేస్తుండటం దురదృష్టకరమని చెప్పారు.

సుశాంత్ ఆత్మహత్య అంశంలో తాము విచారణను ప్రారంభించే సమయంలో... పరిస్థితులు ఇంత దారుణమైన మలుపులు తిరుగుతాయని తాము ఊహించలేదని డీజీపీ అన్నారు. చివరకు అది రాజకీయ మలుపు కూడా తిరిగిందని అసహనం వ్యక్తం చేశారు. సుశాంత్ కేసులో బీహార్ పోలీసులు విచారణ జరపడం ముమ్మాటికీ మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రేనని శివసేన ఆరోపించింది. ఈ ఆరోపణలపై బీహార్ డీజీపీ మాట్లాడుతూ... ఈ కేసుతో సీఎం నితీశ్ కుమార్ కు వచ్చే లాభమేమీ లేదని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయడమే స్థానిక పోలీసుల డ్యూటీ అని అన్నారు.


More Telugu News