ఫేస్‌బుక్‌ పోస్టు వల్ల చెలరేగిన హింస.. ముగ్గురి మృతి.. 60 మందికి గాయాలు

  • బెంగళూరులో ఘటన
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బంధువు కమ్యూనల్ పోస్ట్
  • ఎమ్మెల్యే ఇంటిపై ఆందోళనకారుల దాడి
  • కాల్పులు జరిపిన పోలీసులు
  • 110 మంది అరెస్టు
ఓ ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు విషయంలో వివాదం రాజుకుని అల్లర్లకు దారి తీసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై కొందరు దాడి చేశారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు.

దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టే విధంగా ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేశాడు. దీంతో ఓ వర్గానికి చెందిన వారు మండిపడ్డారు. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి తన వెనుక ఉన్నాడన్న ధైర్యంతోనే అతడు ఇటువంటి పోస్టు చేశాడని గత రాత్రి కావల్‌ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసం వద్దకు జనం భారీగా చేరుకున్నారు.

అక్కడున్న వాహనాలకు నిప్పంటించడంతో ఎమ్మెల్యే ఇంటికి మంటలు అంటుకున్నాయి. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆందోళనకారులు లోపలికి వెళ్లనివ్వలేదు. అక్కడికి పోలీసులు చేరుకోవడంతో ఆందోళనకారులు పోలీసు వాహనాలకు కూడా నిప్పంటించారు.

దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. డీజేహళ్లి, కేజీహళ్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాలేదు. వివాదాస్పద పోస్టు పెట్టిన నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


More Telugu News