కనీస అవగాహన లేని డీజీసీఏ మాకొద్దు... తక్షణం తొలగించాలని ఐసీపీఏ, ఐపీజీ డిమాండ్!

  • కోజికోడ్ ప్రమాదంపై అరుణ్ కుమార్ అసత్యాలు
  • సాంకేతిక పరిజ్ఞానం లేకుండా మాట్లాడారు
  • తొలగించాలని విమానయాన శాఖకు పైలట్ సంఘాల లేఖ
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చీఫ్ అరుణ్ కుమార్ ను వెంటనే పదవి నుంచి తొలగించి, మరో సరైన వ్యక్తిని ఆ పదవిలో నియమించాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ యూనియన్ (ఐసీపీఏ), ఇండియన్ పైలట్స్ గిల్డ్ (ఐపీజీ) డిమాండ్ చేశాయి. ఇటీవల కేరళలోని కోజికోడ్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై అరుణ్ కుమార్, టీవీ చానెళ్లలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రమూ ఆమోదయోగ్యం కాదని, విమానాల నిర్వహణ అనుభవం లేని ఆయన, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తి డీజీసీఏ చీఫ్ గా అనర్హుడని, రెండు పైలట్ యూనియన్లు, పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖను రాశారు.

కాగా, అరుణ్ కుమార్ ఇంటర్వ్యూలు ఇస్తూ, విమానం ల్యాండింగ్ స్మూత్ గా సాగలేదని, సరిగ్గా పైలట్లు విమానాన్ని దించలేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని వ్యాఖ్యానించగా, పైలట్ సంఘాలు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టాయి. పైలట్లు ఎంతో అనుభవజ్ఞులని, కనీస సాంకేతిక పరిజ్ఞానం లేని అరుణ్ కుమార్, ఇలా వ్యాఖ్యానించడం వారిని అవమానించినట్టేనని ఆరోపించాయి. ఈ ప్రమాదంలో విమానం ఇద్దరు పైలట్లు దీపక్ వసంత్ సాథే, అఖిలేశ్ కుమార్ లు సహా 20 మంది మరణించిన సంగతి తెలిసిందే.

ఈ ఇద్దరు పైలట్లూ రెండు యూనియన్లలో ఏ ఒక్కదాన్లోనూ సభ్యులు కాకపోవడం గమనార్హం. అయినప్పటికీ, వారికి మద్దతుగా నిలిచిన యూనియన్లు, ఏదైనా ప్రమాదం జరిగితే, విచారణ తరువాత, సాక్ష్యాలను పరిశీలించిన తరువాతనే కామెంట్లు చేయాలే తప్ప, ఊహాగానాలు చేస్తూ, మాట్లాడటం సరికాదని, అరుణ్ కుమార్ ను తొలగించాలని విమానయాన శాఖపై ఒత్తిడిని పెంచాలని నిర్ణయించాయి.


More Telugu News