ఏపీ మహిళలకు శుభవార్త.. రేపే 'జగనన్న చేయూత' ప్రారంభం
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు చేయూత
- ప్రతి ఏటా రూ. 18,750 ఆర్థిక సాయం
- ఈ ఏడాదికి రూ. 4,700 కోట్ల కేటాయింపు
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జగనన్న చేయూత' పథకం రేపు ప్రారంభం కానుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ప్రతి ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందనున్నారు. నాలుగేళ్లకు గాను ఈ పథకానికి సుమారు రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. ఈ ఏడాదికి రూ. 4,700 కోట్లు కేటాయించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు.