ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలనేది ఒక నినాదం మాత్రమే కారాదు: పార్టీ నేతలకు రాంమాధవ్ హితబోధ

  • ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని సోము వీర్రాజు అన్నారు
  • బలమైన రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలో ఆలోచించాలి
  • అధికారంలోకి రావడమంటే అంత సులభం కాదు
  • సరిగ్గా పనిచేయకపోతే 2024లో ఓడిపోతాం
  • ఆ తర్వాత 2029లో అధికారంలోకి వస్తాము అని చెప్పుకుంటామా?
ఏపీలో నాలుగేళ్లలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాలని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాంమాధవ్ ప్రసంగించారు.

ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండానే కొనసాగుతోందని రాంమాధవ్ ఎద్దేవా చేశారు. 'కనీసం అధ్యక్షుడిని కూడా ఎంపిక చేసుకోలేని స్థితిలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. బీజేపీలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చాలా సహజంగా అధ్యక్షులు నియమితం అవుతున్నారు' అని రాంమాధవ్ చెప్పారు.

'మన పార్టీలో ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు చక్కగా నిర్వహిస్తున్నారు. కన్నా గారి స్థానంలో సోము వీర్రాజు రావడంతో కన్నా గారిని తీసేశారన్న విమర్శలు రావాల్సిన అవసరం లేదు. కన్నా గారు రాబోయే రోజుల్లో మరో బాధ్యతను తీసుకుని పని చేసే అవకాశం లభిస్తుంది' అని రాంమాధవ్ తెలిపారు.

'మన పార్టీలో అందరూ నాయకత్వపు సూత్రంపై ఆధారపడి పనులు కొనసాగిస్తాం. సోము వీర్రాజు నాయకత్వంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని బలపర్చడానికి కృషి చేస్తాం. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి.ఇందాక సోము వీర్రాజు గారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. అది కేవలం ఒక నినాదంగా మాత్రమే ఉండడానికి వీల్లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికే బీజేపీ ఉంది' అని రాంమాధవ్ చెప్పారు.

'అయితే, మన రాజకీయాలు వారసత్వ రాజకీయాలు కాదు. బలమైన రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలో ఆలోచించాలి. లేదంటే 2024లో అధికారంలోకి రాలేం. అధికారంలోకి రావడమంటే అంత సులభం కాదు. సరిగ్గా పనిచేయకపోతే 2024లో ఓడిపోతాం. ఆ తర్వాత 2029లో అధికారంలోకి వస్తాము అని చెప్పుకుంటామా? అటువంటి పరిస్థితి వద్దు. ఇక్కడ అధికారంలోకి రావడానికి మంచి అవకాశం ఉంది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదు. ఆ లోటును మనం భర్తీ చేయాలి' అని రాంమాధవ్ తెలిపారు.

'మమ్మల్ని ఎవ్వరూ వ్యతిరేకించకూడదు అనే భావన వైసీపీ లాంటి పార్టీల్లో ఉంటుంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మనం ఉండాలి. మూడు రాజధానులు అనేది అవినీతికి నిలయంగా మారింది. రాబోయే నాలుగేళ్లలో ఒక బలీయమైన శక్తిగా మన పార్టీ ఎదగాలి. మూడు రాజధానులు నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం అంటోంది. కేంద్రం ఇందులో జోక్యం చేసుకోబోదని కోర్టుకు కూడా చెప్పింది' అని రాంమాధవ్ తెలిపారు.

'కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. గతంలో అమరావతిని రాజధానిగా చేస్తామంటే ప్రోత్సహించింది. రాజధాని వంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం పరిమితంగా ఉంటుంది. అధికారంలో ఉన్న వ్యక్తులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే నిలదీసే విధంగా ఉండాలి. అంతేగానీ, బీజేపీ నేతలు ప్రతిసారి ఢిల్లీలోని నేతలకు ఫోన్ చేయొద్దు. అధిష్ఠానంలోని నేతలు ఏం చేయాలో అది చేస్తారు. కానీ, మనం ఏం చేయాలో అది కూడా చేయాల్సి ఉంటుంది' అని రాంమాధవ్ తెలిపారు.

'అయితే, దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు కడతామంటే విమర్శలు వస్తుంటాయి. వ్యతిరేకించే వారు ఉంటారు. విమర్శించొద్దని అంటే ఎలా? ఆంధ్రప్రదేశ్ కంటే ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ. అక్కడ ఒకే రాజధాని ఉంది. అక్కడ పాలన సజావుగా సాగడం లేదా? ఏపీలో ఒక్క రాజధానిలో జరిగిన అవినీతిపై ఎలా బీజేపీ పోరాటం జరిపిందో అలాగే, మూడు రాజధానుల విషయంలోనూ అవినీతి జరిగితే పోరాటం చేస్తుంది' అని రాంమాధవ్ చెప్పారు.


More Telugu News