ప్రపంచంలోనే అత్యధిక కరోనా తీవ్రత ఇండియాలోనే!

  • ఆందోళనకు గురిచేస్తున్న కేసుల పెరుగుదల
  • 1000కి చేరువైన రోజువారీ మరణాలు
  • మరో పది రోజుల్లో మరణాల్లో టాప్-3కి భారత్
ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా ప్రభావం చూపుతున్న దేశంగా ఇండియా నిలిచింది. అమెరికాతో పాటు యూరప్ దేశాలను గడగడలాడించిన తరువాత, చాలా వారాలకు ఇండియాలో విస్తరించడం ప్రారంభించిన మహమ్మారి వైరస్, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, వైద్యాధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. మిగతా దేశాల్లో తగ్గుముఖం పడుతున్న కేసులు, ఇండియాలో మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజువారీ మరణాలు 1000కి దగ్గర కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం నాటికి కరోనా మరణాల సంఖ్య 45,257కు చేరుకుంది.

ఇక, గత నాలుగు రోజులుగా సగటు కేసుల సంఖ్య 60 వేలను దాటేసింది. మొత్తం కేసుల సంఖ్య 22,68,676కు చేరుకోగా, ఇప్పటివరకూ 15.83 లక్షల మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 70 శాతానికి చేరడం కొంత ఊరటను కలిగిస్తోంది.

గడచిన వారం రోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాలు యూఎస్, బ్రెజిల్ తో పోలిస్తే, ఇండియాలోనే అధికంగా వున్నాయి. జాన్ హాప్కిన్స్ వర్శిటీ రిపోర్టు ప్రకారం, మరణాల విషయంలో అమెరికా ముందుండగా, ఆ తరువాత బ్రెజిల్ ఉంది. ఈ రెండు దేశాల్లో లక్ష మందికి పైగా మరణించారు. ఆపై మెక్సికోలో 53,003, బ్రిటన్ లో 46,611 మంది చనిపోగా, భారత్ లో 45,257 మంది మరణించారు. మరో వారం పది రోజుల్లో మొత్తం మరణాల సంఖ్యలో భారత్ టాప్-3 స్థానానికి చేరుతుందని అంచనా.


More Telugu News