బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ.. హాజరైన రాంమాధవ్

  • అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత మాకు ఉంది
  • దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి
  • తెలుగు వారు ప్రపంచ దేశాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారు
  • ఎన్నికల్లో ఈ అంశాన్ని తెలుపుతూ ఏపీలో ముందుకు వెళతాం
బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయనను ఆ పార్టీ అధిష్ఠానం ఆ పదవిలో నియమించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో పలువురు బీజేపీ నేతల మధ్య ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొన్నారు. ఇంకా సునీల్ దేవధర్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి తదితరులు కూడా హాజరయ్యారు.
 
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఆలోచనా విధానాలే ప్రగతికి తోడ్పడతాయని సోము వీర్రాజు చెప్పారు. 'ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత బీజేపీ, జనసేనకి ఉంది. అభివృద్ధి అనేది బీజేపీ లక్ష్యం. ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమనేది బీజేపీ ధ్యేయం' అని తెలిపారు.

'దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. తెలుగు వారు ప్రపంచ దేశాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారు. ఏపీలో మానవ వనరులను రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వినియోగించాలి. అందుకోసం బీజేపీ అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. ఎన్నికల్లో ఈ అంశాన్ని తెలుపుతూ ఏపీలో ముందుకు వెళతాం' అని వీర్రాజు చెప్పారు.

'ఏపీలో జరుగుతోన్న పరిణామాలను గమనించిన తర్వాత ఈ విషయాన్ని చెబుతున్నాను.  పేదవారికి అభివృద్ధి ఫలాలు అందాలి. దేశంలో బీజేపీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందించింది' అన్నారాయన.

అందరి అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేద్దామనే ఉద్దేశంతో బీజేపీ అభివృద్ధి పనులు కొనసాగిస్తోందని సోము వీర్రాజు తెలిపారు. 2024లో మిత్రపక్షం జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేస్తామని తెలిపారు. ఏపీలో సీఎం జగన్‌ నేతృత్వంలో అసమర్థ పాలన కొనసాగుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.


More Telugu News