11 మంది పాకిస్థాన్ హిందువుల మరణం.. రాజస్థాన్ సీఎంపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

  • పాకిస్థాన్ నుంచి రాజస్థాన్ కు వలస వచ్చిన హిందూ కుటుంబం
  • రసాయన ద్రావణం తాగి ఆత్మహత్య
  • రాష్ట్ర పరిస్థితి నానాటికీ దిగజారుతోందని గజేంద్ర సింగ్ విమర్శలు
పాకిస్థాన్ నుంచి భారత్  కు వలస వచ్చిన హిందూ కుటుంబానికి చెందిన 11 మంది మరణం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ జిల్లాలో వీరు విగతజీవులుగా కనిపించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ పనితీరు ఎంత ఘోరంగా ఉందో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువుల మరణంతో అర్థమవుతోందని గజేంద్రసింగ్ విమర్శించారు. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని చెప్పారు. రాజస్థాన్ లో దారుణ ఘటనలు ఒకదాని వెనుక మరొకటి జరుగుతూనే ఉన్నాయని... రాష్ట్ర పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

మృతుల కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రం బతికాడని జోధ్ పూర్ ఎస్పీ రాహుల్ భరత్ చెప్పారు. వీరి మరణాలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. అయితే ఆదివారం రాత్రి వీరంతా ఒక రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు అర్థమవుతోందని చెప్పారు.


More Telugu News