విజయవాడ ప్రమాదంపై వెంకయ్య నాయుడు, మోదీ దిగ్భ్రాంతి

  • అగ్ని ప్రమాద ఘటనపై విచారం
  • మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి
  • బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. 'విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదంపై సీఎం జగన్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నానని వివరించారు.

ఈ ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ... 'విజయవాడలోని కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యల్లో చురుగ్గా ఉన్నాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News