అన్నవరం ఆలయంలో కరోనా కలకలం
- 39 మంది అర్చకులు, సిబ్బందికి కరోనా పాజిటివ్
- 14వ తేదీ వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు
- కొనసాగనున్న ఏకాంత సేవలు
పలు ఆలయాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో సైతం కరోనా కలకలం రేపుతోంది. నిన్నటి వరకు 10 మంది అర్చకులు, సిబ్బందికి కరోనా సోకింది. దీంతో, 300 మంది సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా... మరో 29 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో, ఆలయంలో ఇప్పటి వరకు 39 మందికి కరోనా సోకినట్టైంది. ఈ నేపథ్యంలో కరోనా నివారణ చర్యలను ఆలయ అధికారులు ప్రారంభించారు. 14వ తేదీ వరకు స్వామివారి దర్శనాలు, వ్రతాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామివారికి ఏకాంత సేవలు మాత్రం యథాతథంగా జరుగుతాయని చెప్పారు.