నాడు నేను వేసిన మొట్టమొదటి విత్తనం అదే: చంద్రబాబు

  • హైటెక్ సిటీని అభివృద్ధి చేశానన్న చంద్రబాబు
  • ఆ రోజు తాను కులం చూసుకోలేదని వివరణ
  • ఇప్పుడు మూడు ముక్కల పేకాట ఆడుతున్నారని విమర్శలు
అభివృద్ధి వికేంద్రీకరణలో ఒక భాగమే అమరావతి అనీ, ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి అనీ, అంతేకానీ అమరావతి తన స్వార్ధం కోసం కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వాస్తవానికి అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని, తనంత తానుగా అభివృద్ధి చెందే నగరం అని ఆయన అన్నారు. నాడు సమైక్యాంధ్రలో హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించానని, ఈ క్రమంలో తాను వేసిన మొట్టమొదటి విత్తనం హైటెక్ సిటీ అని చంద్రబాబు పేర్కొన్నారు.

"ఆ సమయంలో నన్ను చాలా మంది తప్పుబట్టారు. ఎంతోమంది విమర్శించారు. ఆ రోజు హైదరాబాదులో నా బంధువులు లేరు, నా కులం లేదు, నా స్వార్థం లేదు. పొలాల కోసం కాదు. అయినాగానీ అభివృద్ధి చేశాం. హైదరాబాద్ విషయంలో నాకెంతో తృప్తిగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ విషయంలోనూ అలాగే ఆలోచించాను. దక్షిణ భారతదేశంలో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఏపీనే. 160 ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఏపీ తిరుగులేని రాష్ట్రం అవుతుంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక ప్రాజెక్టులకు అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే అ నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ.

ఈ రోజు అమరావతిని ధ్వంసం చేస్తాను, మూడు ముక్కలు చేస్తాను, మూడు ముక్కల పేకాట ఆడతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి. మూడు రాజధానులు ఏర్పాటైతే కర్నూలు ప్రజలు శ్రీకాకుళం వెళ్లేందుకు ఏది దారి? ఇచ్ఛాపురం వాళ్లు కర్నూలు రావాలంటే ఎలా వస్తారు? చిత్తూరు వాళ్లు రాజధానికి వెళ్లాలంటే ఏవిధంగా వెళతారు?" అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.


More Telugu News