చైనాలో పుట్టుకొచ్చిన మరో కొత్త వైరస్... ఇప్పటికే ఏడుగురి బలి!

  • చైనాలో నావెల్ బున్యా వైరస్
  • వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న పినుజులు
  • తీవ్ర జ్వరం కలిగిస్తున్న కొత్త వైరస్
కరోనా వంటి మహమ్మారి వైరస్ ను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలో ఇప్పుడు ఓ కొత్త రకం వైరస్ దాడి చేస్తోంది. ఈ వైరస్ రక్తంపీల్చే పినుజులు (టిక్స్) వంటి జీవుల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్టు  గుర్తించారు. ఇప్పటికే ఈ నూతన వైరస్ బారినపడి ఏడుగురు మరణించారు. తూర్పు చైనాలోని జియాంగ్సు, అన్హుయి ప్రావిన్స్ ల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంది. 60 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు.  ఈ వైరస్ ను ప్రస్తుతానికి టిక్ బోర్న్ వైరస్ (టీబీవీ), లేదా నావెల్ బున్యా వైరస్ గా పేర్కొంటున్నారు.

సాధారణంగా కుక్కలు, పిల్లుల వంటి జంతువులను అంటిపెట్టుకుని, వాటి రక్తం పీల్చుతూ బతికే ఈ పినుజులు 83 రకాల వైరస్ లకు ఆవాసాలుగా ఉన్నాయని గుర్తించారు. ఈ వైరస్ సోకితే మనుషుల్లో తీవ్ర జ్వరం కలుగుతుంది. సరైన చికిత్స అందకపోతే మృత్యువు కబళించడం ఖాయం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కరోనా వైరస్ గురించి సకాలంలో ప్రపంచానికి సమాచారం అందించలేదని అపవాదు ఎదురొన్న చైనా ప్రభుత్వం, ఈ కొత్త వైరస్ విషయంలో ఆ పొరపాటు లేకుండా తన అధికారిక పత్రికలో వెల్లడించింది. సహజసిద్ధంగా వ్యాపిస్తున్న కొత్త అంటువ్యాధి అని పేర్కొంది. ఈ కొత్త వైరస్ తో కలిగిన మరణాలను మొదట డెంగ్యూ, ఇతర దోమకాటు వ్యాధుల కారణంగా సంభవించి ఉండొచ్చని భావించారు. అయితే ఈ మరణాలకు దోమకాటు కారణం కాదని, పినుజుల ద్వారా వ్యాప్తి చెందే నావెల్ బున్యా వైరస్ కారణమని ఆరోగ్య నిపుణులు నిర్ధారించారు.


More Telugu News