వ్యాక్సిన్ రిలీజ్ అయ్యే తేదీని ప్రకటించేసిన డొనాల్డ్ ట్రంప్!

  • నవంబర్ 3 నాటికి యూఎస్ లో వ్యాక్సిన్
  • చైనాకు వ్యాక్సిన్ సమాచారాన్ని దొంగిలించే సత్తా ఉంది
  • రేడియో లైవ్ లో యూఎస్ అధ్యక్షుడు
కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని, అమెరికా చేతిలో నవంబర్ 3 నాటికి వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ఆయన, అమెరికా వద్ద ఉన్న కరోనా వ్యాక్సిన్ సమాచారాన్ని చైనా దొంగిలించిందా? అన్న విషయాన్ని తాను చెప్పలేను కానీ, అది చైనాకు సాధ్యమయ్యేపనేనని మాత్రం నమ్ముతున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.

కాగా, యూఎస్ లో ఈసారి ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా నవంబర్ 3నే జరుగుతాయి. ఈ నేపథ్యంలో నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపణలకు దిగింది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరువకాగా, ఇప్పటివరకూ 1.61 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు.


ఇదిలావుండగా, జనవరి నాటికి కరోనాకు చెక్ చెప్పే అవకాశాలు ఉన్నాయని యూఎస్ వైద్య నిపుణుడు ఆంటోనీ పౌచీ వ్యాఖ్యానించారు. ప్రముఖ వార్తాసంస్థ 'రాయిటర్స్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, కరోనాను పూర్తి స్థాయిలో అంతం చేసే అవకాశాలు ఉండవని భావిస్తున్నానని, అయితే, వ్యాక్సిన్ తో దాన్ని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చని ఆయన అన్నారు. వ్యాక్సిన్ వస్తే, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎంతమాత్రమూ కనిపించబోదని పౌచీ అభిప్రాయపడ్డారు.


More Telugu News