కరోనా వైద్యం కోసం దయచేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు: మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి

  • ఇతర రాష్ట్రాలకు దీటుగా చికిత్స అందిస్తున్నామని వెల్లడి
  • నెలకు కూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ఆళ్ల నాని
  • సీఎం జగన్ స్వయంగా సమీక్షిస్తున్నారని వివరణ
ఏపీ మంత్రి ఆళ్ల నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వస్తే మంత్రులు, ఐఏఎస్ లు, ఇతర అధికారులు చికిత్స కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేపడుతున్నామని, కరోనా నివారణ, సహాయ చర్యల కోసం రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఏపీలో వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అందుతున్న సేవలపై సీఎం జగన్ స్వయంగా సమీక్షిస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు.

కరోనా రోగులకు అరగంటలో బెడ్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్నందునే కేసుల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతోందని మంత్రి ఆళ్ల నాని వివరించారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆపై తిరుపతిలోని స్విమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.


More Telugu News