సుశాంత్ కేసులో నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన సీబీఐ

  • రియాపై బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశాంత్ తండ్రి
  • సుశాంత్ కేసు సీబీఐకి బదిలీ చేసిన బీహార్ పోలీసులు
  • ఈ కేసును స్వీకరిస్తున్నట్టు వెల్లడించిన సీబీఐ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో నిగూఢంగా ఉన్న అంశాలను వెలికితీసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో బీహార్ పోలీసుల దర్యాప్తుకు కొనసాగింపుగా తాము కేసు నమోదు చేస్తున్నట్టు సీబీఐ ఇవాళ వెల్లడించింది. కాగా, సుశాంత్ మరణంపై ఆయన తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఇప్పుడా కేసునే బుధవారం నాడు సీబీఐకి బదిలీ చేశారు.

అంతకుముందు కేకే సింగ్ తన ఫిర్యాదులో ప్రధానంగా నటి రియా చక్రవర్తిపైనే ఆరోపణలు చేశారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు సంబంధించిన ఖాతాల్లోకి కోట్ల రూపాయలు తరలించిందని, రియా మానసిక వేధింపులే సుశాంత్ ను బలవన్మరణం దిశగా నడిపించాయని ఆయన పేర్కొన్నారు.

అటు, ముంబయి పోలీసులు సుశాంత్ కేసులో రియాకు క్లీన్ చిట్ ఇచ్చారు. రియా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆధారాల్లేవని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, సీబీఐ ఈ కేసును స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ముంబయి పోలీసులతో పాటు ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు షురూ చేస్తున్న తరుణంలో సీబీఐ ఎలాంటి వివరాలు వెలికి తీస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News