న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై మెరిసిన అయోధ్య రాముడు... వీడియో ఇదిగో!

  • నిన్న అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన
  • ఆపై భారీ బిల్ బోర్డుపై రాముని 3డీ రూపం
  • భారత్ కు దక్కిన గౌరవమన్న జగదీశ్ స్వాహానీ
ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై శ్రీరామ చంద్రుని చిత్రం, అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామాలయ నమూనా 3డీ చిత్రాలు ప్రత్యక్షం కావడంతో, అమెరికాలోని భారతీయులు, వారి సంతతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సమయంలో అక్కడున్న వారంతా 'జై శ్రీరామ్' అంటూ నినదించారు. టైమ్ స్క్వేర్ భవనంపై ఉన్న ఓ పెద్ద బిల్ బోర్డుపై ఈ చిత్రాలను ప్రదర్శించారు. అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయానికి శంకుస్థాపన జరిగిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది.

ప్రపంచంలోనే అత్యంత భారీ బిల్ బోర్డుల్లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై ఏర్పాటు చేసిన బిల్ బోర్డు కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. దాదాపు 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికన్ ఇండియా పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ జగదీశ్ స్వాహానీ, శ్రీరాముని ఆలయ నిర్మాణం సందర్భంగా దక్కిన మరో గౌరవం ఇదని వ్యాఖ్యానించారు. కాగా, అంతకు కొద్ది గంటల ముందు ఇదే టైమ్ స్క్వేర్ భవంతిపై శ్రీరాముని చిత్రాలు ప్రదర్శించబడ్డాయంటూ కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అవి ఫేక్ అని నెటిజన్లు వెంటనే కనిపెట్టేశారు కూడా. ఆపై కాసేపటికే అదే టైమ్ స్క్వేర్ పై శ్రీరాముని వీడియో ప్రత్యక్షం కావడంతో ఆక్కడి ఇండియన్స్ సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారు.


More Telugu News