బీరూట్‌ పేలుళ్లు భయంకరమైన దాడిలా కనపడుతున్నాయి: ట్రంప్

  • లెబనాన్‌కు తోడుగా ఉంటాం
  • ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం
  • ఇది పేలుడు పదార్థాల తయారీ వల్ల సంభవించలేదు
  • బాంబు దాడి అని భావిస్తున్నాం
లెబనాన్ రాజధాని బీరూట్‌లో నిన్న సంభవించిన భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 78కి చేరింది. దాదాపు నాలుగు వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నగరంలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలు కనపడుతున్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ స్పందిస్తూ‌ విచారం వ్యక్తం చేశారు.

లెబనాన్‌కు తమ దేశం తోడుగా ఉంటుందని, ఆ దేశానికి ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటన భయంకరమైన దాడిలా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది పేలుడు పదార్థాల తయారీ వల్ల సంభవించలేదని, బాంబు దాడి అని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను తన యంత్రాంగంలోని కొంతమంది అత్యుత్తమ జనరల్స్‌తో మాట్లాడానని, తనతో వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపారు.

కాగా, తాము గతంలో స్వాధీనం చేసుకున్న ఓ నౌకలోని పేలుడు పదార్థాలను పోర్టు ఏరియాలో నిల్వ చేశారని, వాటి వల్లే ఈ ఘటన సంభవించినట్లు లెబనీస్‌ జనరల్‌ సెక్యూరిటీ చీఫ్‌ అబ్బాస్‌ ఇబ్రహీం కూడా వెల్లడించారు. కాగా, లెబనాన్‌ ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నామని, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్ చెప్పారు.


More Telugu News