రోజువారీ కొత్త కేసులతో పాటు మరణాల్లోనూ ప్రపంచ అత్యధికం ఇండియాలోనే!

  • కొత్త కేసుల విషయంలో అమెరికాను దాటేసిన ఇండియా
  • 19 లక్షలను దాటిన కరోనా కేసుల సంఖ్య
  • కొత్త కేసుల విషయంలో తొలిస్థానంలో ఏపీ
కరోనా విజృంభించిన దేశాలన్నీ, వైరస్ కట్టడిలో ముందంజలో ఉండగా, ఇండియాలో మాత్రం కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ తొలుత వ్యాపించిన దేశాలతో పోలిస్తే, ఎంతో ఆలస్యంగా కేసులు ప్రారంభమైన ఇండియాలో ఇప్పుడు వైరస్ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల విషయంలో ఇప్పుడు అమెరికాను కూడా ఇండియా దాటేసింది. వరుసగా రెండో రోజు కూడా అత్యధిక కొత్త కేసులు ఇండియాలోనే నమోదు కావడం గమనార్హం.

కేసుల సంఖ్యలో తొలి స్థానంలో ఉన్న అమెరికాలో సోమవారం నాడు 48,622 కేసులు రాగా, రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ లో 17,988 కేసులు రాగా, ఇండియాలో 49,134 కొత్త కేసులు వచ్చాయి. ఇదే సమయంలో బ్రెజిల్ లో 572 మంది, యూఎస్ లో 568 మంది మరణించగా, ఇండియాలో 814 మంది వైరస్ కారణంగా కన్నుమూశారు. ఆపై మంగళవారం నాడు మాత్రం ఇండియాలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

ప్రస్తుతం ఇండియాలో కేసుల సంఖ్య 19.04 లక్షలను దాటేసింది. రోజువారీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా 9,747 కొత్త కేసులను కళ్లజూసింది. ఆ తరువాతి స్థానంలో మహారాష్ట్రలో  7,760 కేసులు వచ్చాయి. ఈ సంఖ్య గడచిన ఆరు రోజులతో పోలిస్తే కాస్తంత తక్కువే అయినప్పటికీ, మరణాల విషయంలో మాత్రం మరో రికార్డు నమోదైంది. మహారాష్ట్రలో మంగళవారం నాడు 322 మంది మరణించారు. కర్ణాటకలోనూ వైరస్ విజృంభణ అధికంగానే ఉంది. బెంగళూరు నగరంలో కొత్తగా 2,035 కేసులు వచ్చాయి.


More Telugu News