కేసుల నుంచి తప్పించుకునేందుకే వైసీపీలోకి వస్తున్నారు: గంటాపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

  • దొడ్డి దారిలో పార్టీలో చేరేందుకు యత్నిస్తున్నాడు
  • గంటా భూ కుంభకోణాలపై అయ్యన్న గతంలోనే ఫిర్యాదు చేశారు
  • గంటా విషయం అధిష్ఠానం చూసుకుంటుంది
విశాఖలో వీరిద్దరూ కీలక నేతలు. గత ఎన్నికల ముందు వరకు ఇద్దరూ  తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వారే మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. కొన్ని రోజుల్లో వైసీపీలో చేరేందుకు గంటా రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో, అవంతి  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేసిన అరాచకాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డి దారిలో పార్టీలో చేరేందుకు గంటా ప్రయత్నిస్తున్నారని అవంతి విమర్శించారు. వైసీపీలో చేరేందుకు ముహూర్తాలు, లీకులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

గంటా భూ కుంభకోణాలపై గతంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారని అవంతి తెలిపారు. ఈ అంశంపై సిట్ తో విచారణ కూడా చేయించారని చెప్పారు. భూ కుంభకోణం, సైకిళ్ల స్కామ్ పై తాను, విజయసాయి రెడ్డి ఇప్పటికే మాట్లాడామని తెలిపారు. పార్టీలో గంటా చేరేది, లేనిది అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు.

జగన్ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్ విసరడంలో అర్థం లేదని అవంతి అన్నారు. చంద్రబాబు చెపితే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోరని ఎద్దేవా చేశారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది ఏడాదిన్నర పాలన కోసం కాదని... ఐదేళ్లు పాలించమని అని చెప్పారు.


More Telugu News