కరోనా వ్యాక్సిన్ ధరపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా

  • కొవాగ్జిన్ పేరిట వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్
  • వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే లభ్యమవుతుందన్న కృష్ణ ఎల్లా
  • జీనోమ్ వ్యాలీలో చర్చా కార్యక్రమం
కరోనాపై వ్యాక్సిన్ కోసం ముమ్మర పరిశోధనలు సాగిస్తున్న సంస్థల్లో హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముందంజలో ఉంది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరుతో రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. తాజాగా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, తాము వ్యాక్సిన్ నాణ్యత విషయంలో రాజీపడబోవడంలేదని, భారత్ లో ఎలాంటి వ్యాక్సిన్ అందిస్తామో, ప్రపంచదేశాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ కూడా అదే నాణ్యతతో ఉంటుందని స్పష్టం చేశారు. పైగా ఓ మంచినీళ్ల బాటిల్ ధర కంటే తక్కువ ధరకే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

కరోనా అనేది కొత్త వైరస్ కావడంతో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, అయినప్పటికీ వ్యాక్సిన్ అభివృద్ధిలో నిపుణత సాధించామని కృష్ణ ఎల్లా వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా కూడా వ్యాక్సిన్ తయారీలో సహకారం అందిస్తోందని తెలిపారు. కాగా, వ్యాక్సిన్ తయారీకి సంబంధించి తాము ప్రతి చిన్న అనుమతి కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుందని, అలాకాకుండా అనుమతులు ప్రాంతీయ కేంద్రాల నుంచి మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

భారత్ లో తయారయ్యే వ్యాక్సిన్లలో 70 శాతం హైదరాబాదుకు చెందిన 3 కంపెనీలే తయారుచేస్తున్నాయని, దేశ ఆవిష్కరణల్లో తెలంగాణ నాయకత్వ స్థానంలో ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ చర్చా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండీ మహిమ దాట్ల, ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ ఎండీ డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News