భర్త ముందే మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు.. న్యాయం చేయాలి: లోకేశ్

  • 15 నెలల పాలనలో 400 అత్యాచార ఘటనలు
  • 21 రోజుల్లో న్యాయం ఎక్కడ?  
  • క్షేత్రస్థాయిలో మహిళలకు న్యాయం జరగడం లేదు
  • బాధిత మహిళలకు జగన్ రెడ్డి గారి పాలనలో అన్యాయం
సీఎం జగన్‌ పాలనలో గిరిజనులకు రక్షణ లేకుండాపోతోందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. '15 నెలల పాలనలో 400 అత్యాచార ఘటనలు. 21 రోజుల్లో న్యాయం ఎక్కడ? దిశ చట్టం, ఈ-రక్షా బంధన్ అంటూ వైఎస్ జగన్ గారి పబ్లిసిటీ పిచ్చి తప్ప క్షేత్రస్థాయిలో మహిళలకు న్యాయం జరగడం లేదు. కర్నూలు జిల్లాలో భర్త ముందే ఒక ఎస్టీ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు' అని పేర్కొన్నారు.

'కేసు నమోదు చెయ్యడానికి గిరిజన సంఘాలు ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, బాధిత మహిళలకు జగన్ రెడ్డి గారి పాలనలో ఎంత అన్యాయం జరుగుతోందో అర్థం అవుతుంది. అత్యాచారానికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు. కాగా, గిరిజన మహిళపై కొందరు సామూహిక అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వార్తను ఆయన పోస్ట్ చేశారు.

కర్నూలు జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని ఆ వార్తలో పేర్కొన్నారు. బాధితురాలు భర్తతో కలిసి గాలేరు వంతెన వద్ద నిద్రిస్తుండగా ముగ్గురు చెంచు యువకులు ఆమె భర్తపై దాడిచేసి, ఆయనను గాయపరిచి ఆమెను ముళ్ల పొదల్లోకి ఈడ్చుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అందులో వివరించారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు పోలీసు స్టేషను వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ కేసుపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని బాధితురాలి భర్త, బంధువులు ఆరోపిస్తున్నారు. 


More Telugu News