హోటల్ వ్యాపారాన్ని ఆదుకునేందుకు.. దేశ ప్రజలకు బ్రిటన్ అద్భుత ఆఫర్!

  • 18 లక్షల మంది చెఫ్‌లు, వెయిటర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు కాపాడడమే లక్ష్యం
  • సోమవారం నుంచి బుధవారం వరకు ఆఫర్
  • ఆఫర్‌ను రూపొందించిన మంత్రి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు
కరోనాతో కునారిల్లిన రెస్టారెంట్ వ్యాపారాన్ని ఆదుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. దేశంలో ఎక్కడైనా, ఏ రెస్టారెంట్‌లోనైనా కావాల్సినంత తిని సగమే చెల్లించొచ్చు. ఈ నెల మొత్తం ఇది అందుబాటులో ఉంటుందని, సోమవారం నుంచి బుధవారం వరకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. తిన్న తర్వాత ఎలాంటి ఓచర్ లేకుండానే సగం బిల్లు చెల్లించొచ్చు. అంతేకాదు, సరిగ్గా ఇంతే ఇవ్వాలన్న నిబంధన కూడా లేదు. తోచినంత ఇవ్వొచ్చు. గరిష్టంగా 10 పౌండ్ల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

దేశంలో ఎంపిక చేసిన దాదాపు 72 వేల రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. దీనికి ‘ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్’ అనే పేరు పెట్టారు. దేశంలో దెబ్బతిన్న హోటల్ వ్యాపారాన్ని తిరిగి పట్టాలెక్కించడమే లక్ష్యంగా ఈ ఆఫర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది చెఫ్‌లు, వెయిటర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగాలను కాపాడడమే లక్ష్యంగా ఈ ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చినట్టు ఆర్థిక మంత్రి రిషి సునక్ పేర్కొన్నారు.  ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన ఆయనే ఈ పథకానికి రూపకల్పన చేయడం విశేషం. ఆఫర్ ప్రకటించిన తర్వాత బ్రిటన్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.


More Telugu News