సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు కోసం.. ముంబైకి వచ్చిన ఐపీఎస్‌ అధికారిని క్వారంటైన్‌ చేసిన మహారాష్ట్ర!

  • విచారణ కోసం ముంబై వెళ్లిన బీహార్ ఐపీఎస్
  • ముంబై అధికారుల తీరుపై బీహార్ డీజీపీ అభ్యంతరం
  • రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో క్వారంటైన్ చేశారని వివరణ
  • ఐపీఎస్‌ మెస్‌లో ఆయనకు వ‌సతి ఇవ్వ‌లేద‌ని ఆగ్రహం
ఇటీవల బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  బీహార్ పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీహార్ పోలీసులు ముంబైకి వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు ముంబై వెళ్లిన బీహార్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విన‌య్ తివారీని క్వారంటైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ముంబైకి విన‌య్ తివారీ చేరుకోగానే అక్క‌డి మునిసిప‌ల్ అధికారులు ఆయనను బ‌ల‌వంతంగా క్వారంటైన్ చేసిన‌ట్లు బీహార్ డీజీపీ గుప్తేశ్వ‌ర్ పాండే ఆరోపించారు. రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన వివరించారు. అలాగే, ఐపీఎస్‌ మెస్‌లో ఆయనకు వ‌సతి ఇవ్వ‌లేద‌ని చెప్పారు. ప్రస్తుతం గోరేగావ్‌లోని గెస్ట్‌హౌస్‌లో ఆయన క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసును పాట్నా నుంచి ముంబై పోలీసులకు అప్పగించాలని ఇప్పటికే రియా కోర్టును ఆశ్రయించింది. పాట్నాలో విచారణ జరిపితే ఈ కేసును సుశాంత్‌ తండ్రి ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఆమె ఆరోపించింది.


More Telugu News