ట్వీట్లు చేస్తూ కూర్చుంటే కష్టం.. రాహుల్‌పై దిగ్విజయ్ సునిశిత విమర్శలు

  • పార్లమెంటులో మరింత చురుగ్గా ఉండాలి
  • అధ్యక్ష పదవికి న్యాయం చేయాలంటే ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి
  • దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విప్ మాణిక్యం మండిపాటు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సునిశిత విమర్శలు చేశారు. ఇలాగైతే పార్టీ ప్రజల్లోకి వెళ్లడం కష్టమని తెగేసి చెప్పేశారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, పార్లమెంటులో మరింత చురుగ్గా ఉండాలని, అప్పుడే పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. నిజానికి రాహుల్ ప్రజల మధ్య ఎక్కువగా ఉండరని, అధ్యక్ష పదవికి న్యాయం చేయాలంటే ప్రజల్లో కలిసిపోవాలని, బడుగు, బలహీన వర్గాల నుంచి అందరికీ అందుబాటులో ఉండాలని రాహుల్‌కు సూచించారు. ట్వీట్లు ఒక్కటే చేస్తూ కూర్చుంటే సరిపోదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిగ్విజయ్ వ్యాఖ్యలపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలను పలువురు నేతలు తప్పుబట్టినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఇప్పటికే 100కుపైగా పాదయాత్రలు నిర్వహించారని, లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్యం ఠాగోర్ అన్నారు. పార్టీలో ఉన్నత పదవిని అలంకరించబోయే వ్యక్తికి వీలైతే మద్దతుగా నిలబడాలని, అంతేతప్ప ఇలా వెనక నుంచి విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. తాము ఎల్లకాలం ప్రతిపక్షంలోనే ఉండబోమని మాణిక్యం స్పష్టం చేశారు.


More Telugu News