సుశాంత్ కేసు: దిశా సలియా వివరాలు అడిగిన బీహార్ పోలీసులు... దిమ్మదిరిగే సమాధానం ఇచ్చిన ముంబయి పోలీసులు

  • సుశాంత్ వ్యవహారంలో బీహార్ పోలీసుల దర్యాప్తు
  • దిశా సలియా ఫైల్ అడిగిన బీహార్ పోలీసులు
  • ఫైల్ డిలీట్ అయిందన్న ముంబయి పోలీసులు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియా మృతికి సంబంధించిన వివరాల కోసం బీహార్ పోలీసుల బృందం ముంబయి చేరుకుంది. సుశాంత్ మరణానికి ముందే దిశ సలియా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దిశా సలియా మరణానికి సంబంధించి వివరాల కోసం బీహార్ పోలీసులు ముంబయిలోని మాల్వాని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దిశా కేసుకు సంబంధించిన ఫైల్ ఇవ్వాలని అక్కడి పోలీసులను కోరగా, ఆ ఫైలు పొరబాటున డిలీట్ అయిపోయిందని, మళ్లీ ఆ ఫైల్ ను తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని మాల్వాని పోలీసులు జవాబిచ్చారు. ఈ సమాధానంతో బీహార్ పోలీసులకు మతిపోయినంత పనైంది.

వాస్తవానికి ఓ పోలీసు అధికారి దిశ సలియా కేసు వివరాలను బీహార్ పోలీసులతో పంచుకునేందుకు మొగ్గు చూపారు. కానీ ఆయనకు ఓ ఫోన్ కాల్ రావడంతో పరిస్థితులు మారిపోయాయి! ఆ వెంటనే... ఫైల్ డిలీట్ అయిందన్న సమాధానం వచ్చింది. ఆ ఫైల్ ను రిట్రీవ్ చేసేందుకు తాము సాయపడతామంటూ బీహార్ పోలీసులు చెప్పగా, ఆ ఫైల్ ఉన్న ల్యాప్ టాప్ ను తెరిచేందుకు మాల్వాని పోలీసులు అంగీకరించలేదు. దాంతో బీహార్ పోలీసులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

అయితే, దిశ సలియా కుటుంబ సభ్యులతో మాట్లాడితే కొన్ని వివరాలైనా తెలుస్తాయని వారు భావిస్తున్నారు. అంతేకాదు, సుశాంత్ ఆత్మహత్య అనంతరం మొదటగా తలుపులు తెరిచిన వ్యక్తితోనూ మాట్లాడాలని యోచిస్తున్నారు.


More Telugu News