ఆ సమయంలో జగన్ కమిట్ మెంట్ చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను: రఘురామకృష్ణరాజు

  • జగన్ ను ప్రజలు గుడ్డిగా నమ్మారని వ్యాఖ్యలు
  • జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శలు చేసిన రఘురామ
  • అమరావతిపై రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్
ఏపీకి మూడు రాజధానుల అంశం అధికారికం అయిన నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రంగా స్పందించారు. అమరావతి అంశంపై రెఫరెండం నిర్వహించాలని, వైసీపీ ప్రజాప్రతినిధులకు రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, అమరావతి విషయంలో సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అప్పట్లో జగన్ చర్యలు ప్రజల్లో ఎంతో నమ్మకం కలిగించాయని, ఆయన అమరావతిలో పార్టీ ఆఫీసుతో పాటు ఇల్లు కూడా కట్టుకోవడంతో ప్రజలు ఆయనను నమ్మారని తెలిపారు.

"నేను అమరావతికి వ్యతిరేకం అని ప్రజలు భావిస్తున్నారు, నేను వ్యతిరేకం కాదు... ఆ చంద్రబాబునాయుడికి ఇక్కడ ఇల్లు ఉందా? ఏముంది? అంటూ నాడు జగన్ నమ్మబలికారు. ఆ సమయంలో నేను వైసీపీలో లేకపోయినా జగన్ కమిట్ మెంట్ చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ప్రజలు కూడా ఎంతో సంతోషించారు. చంద్రబాబు సైతం ఇల్లు కట్టుకోని చోట జగన్ ఇల్లు కట్టుకున్నాడని ప్రజలు గుడ్డిగా నమ్మారు. కానీ ఇప్పుడు జగన్ ప్రజలను మోసం చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు దక్షిణాఫ్రికాను చూసి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అసలే మనది విభజించిన తర్వాత చిన్నరాష్ట్రం అయింది. దానికి మూడు రాజధానులు ఎందుకు? న్యాయవ్యవస్థలు ఏర్పాటు చేసినంత మాత్రాన కర్నూలు రాజధానిగా అభివృద్ధి జరుగుతుందా?" అంటూ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News