టీడీపీ అలాచేస్తే వికేంద్రీకరణపై పునరాలోచన చేస్తాం: ఏపీ మంత్రి కొడాలి నాని

  • 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలి
  • చంద్రబాబు ఉప ఎన్నికలకు వెళ్లాలి
  • టీడీపీ 20కి 20 సీట్లు గెలుచుకోవాలి 
  • టీడీపీ ఓడిపోతే మాత్రం 3 రాజధానులకు మద్దతివ్వాలి 
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దమ్ముంటే 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఏపీ మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. అలాచేశాక, టీడీపీ 20కి 20 సీట్లు గెలుచుకుంటే తమ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. టీడీపీ ఓడిపోతే మాత్రం మూడు రాజధానులకు  మద్దతు ఇవ్వాలన్నారు.

గత టీడీపీ పాలనలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు విసుగు చెందడంతోనే ప్రజలు టీడీపీని గత ఎన్నికల్లో ఓడించారని ఆయన చెప్పారు. జూమ్‌ యాప్‌లో మాట్లాడుతూ చంద్రబాబు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల్లో 52 సీట్లలో కేవలం బాలకృష్ణను మాత్రమే చంద్రబాబు గెలిపించారని ఆయన విమర్శించారు.

అక్కడ కూడా ప్రజలు టీడీపీని వద్దనుకున్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదని చెప్పారు. తెలుగు దేశం పార్టీకి కంచుకోటలా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ టీడీపీకి ప్రజలు ఓట్లు వేయలేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు, సీఎం జగన్‌ నిర్ణయాల మేరకు తీసుకున్న వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని ఆయన అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకే చోట లక్ష కోట్ల రూపాయల వ్యయంతో మహానగరం నిర్మించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News