అవనిగడ్డ మండలంలో భారీ పేలుడు.. 2 కిలోమీటర్లు వినిపించిన శబ్దం

  • భయంతో ఉలిక్కిపడిన గ్రామస్థులు
  • పలు ఇళ్ల గోడలకు పగుళ్లు
  • ఒత్తిడి కారణంగా పేలిపోయిన యూరియా బస్తాలు
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామంలో నిన్న రాత్రి భారీ పేలుడు సంభవించింది. గ్రామానికి చెందిన తుంగల దిలీప్ పశువుల పాక నుంచి రాత్రి 8:45 గంటల సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇది వినిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమీపంలోని పలు ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై అన్వేషించారు. పశువుల పాకలోని యూరియా బస్తాల వద్ద పేలుడు జరిగిందని, సోడియం నైట్రేట్, అమోనియంలను నిల్వ ఉంచడం వల్ల ఒత్తిడికి గురై పేలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News