టిక్‌టాక్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది: ట్రంప్

  • అమెరికా పౌరుల సమాచార గోప్యతపై ఆందోళన
  • నిషేధానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్
  • మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుందంటూ వచ్చిన వార్తలపై టిక్‌టాక్ స్పందన
భారత్‌లో నిషేధంతో ఇప్పటికే కష్టాలు పడుతున్న వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌కు అమెరికాలోనూ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. టిక్‌టాక్‌ను నిషేధించే విషయాన్ని తమ పరిపాలన విభాగం పరిశీలిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు.

ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని, నిషేధానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని మీడియాకు తెలిపారు. అమెరికా పౌరుల సమాచార గోప్యతపై ఆందోళన వ్యక్తమవుతుండడంతో టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గత నెలలో పేర్కొన్నారు.  

మరోవైపు, టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్టు వస్తున్న వార్తలపై టిక్‌టాక్ స్పందించింది. ఇవి పూర్తిగా నిరాధార వార్తలని, ఇలాంటి ఊహాగానాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. టిక్‌టాక్ దీర్ఘకాలిక విజయంపై తమకు నమ్మకముందని స్పష్టం చేసింది.


More Telugu News