ఏపీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నాం: తేల్చిచెప్పిన సోము వీర్రాజు

  • గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్
  • మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా ఏపీ సర్కారుదేనని వెల్లడి
  • గవర్నర్ పై రాజకీయ వ్యాఖ్యలు సరికాదన్న సోము
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో స్పందనలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ, మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా ఏపీ ప్రభుత్వానిదేనని, బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడం పట్ల రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలో భాగమని, ఆయన రాజకీయ వ్యవస్థలో భాగం కాదని పేర్కొన్నారు.

తాము మాత్రం ఏపీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా రాజధానికి మద్దతు తెలిపామని, రాష్ట్ర బీజేపీ కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉందని తెలిపారు. రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఇప్పటికీ సమర్థిస్తున్నామని, వారికి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని వివరించారు. రాజధాని రైతుల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు.


More Telugu News