భారత్ లో కార్ల అమ్మకాల్లో తిరుగులేని కియా మోటార్స్

  • 11 నెలల్లో లక్షకు పైగా అమ్మకాలు
  • అత్యంత తక్కువ కాలంలో ఈ ఘనత సాధించిన కియా
  • కేవలం రెండు మోడళ్లతో భారత మార్కెట్లో హవా
భారత్ లో ప్లాంట్ ఏర్పాటు చేసుకుని కార్ల తయారీ చేపట్టిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా అమ్మకాల్లో దూసుకుపోతోంది. గత 11 నెలల కాలంలో మరే సంస్థకు సాధ్యం కాని రీతిలో లక్షకు పైగా వాహనాలు విక్రయించింది. అత్యంత తక్కువ కాలంలో లక్షకు పైగా వాహనాలు విక్రయించిన ఆటోమొబైల్ సంస్థగా కియా రికార్టు నెలకొల్పింది. కియా తన తొలి కారు సెల్టోస్ ను భారత్ మార్కెట్లో 2019 ఆగస్టులో ఆవిష్కరించింది. ఆ తర్వాత మల్టీపర్పస్ వెహికిల్ కార్నివాల్ ను కూడా తీసుకువచ్చింది. ఈ రెండు మోడళ్లతో కియా భారత్ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతోంది.

కియా ఇప్పటివరకు 97,745 సెల్టోస్ కార్లు, 3,164 కార్నివాల్ వాహనాలు విక్రయించింది. దీనిపై కియా ఎండీ, సీఈవో కూక్ హ్యున్ షిమ్ స్పందిస్తూ, భారత వినియోగదారులు తమ కార్లను ఆమోదిస్తున్న తీరు పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. కేవలం రెండు మోడళ్లతో లక్ష అమ్మకాల మైలురాయి అధిగమించడం భారత్ పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తోందని పేర్కొన్నారు.


More Telugu News