విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు ఇది తగిన సమయం కాదు: వైవీ సుబ్బారెడ్డి

  • వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం
  • రాజధాని తరలింపుపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్న వైవీ
  • అన్ని ప్రాంతాల అభివృద్ధికే మూడు రాజధానులు అని వెల్లడి
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై స్పందించారు. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని ఎప్పుడు తరలిస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ, ఇప్పుడు ప్రపంచం అంతా కరోనాతో సతమతమవుతోందని అన్నారు. ఇప్పటికిప్పుడు విశాఖకు రాజధాని తరలించే పరిస్థితి లేదని, దీనిపై సీఎం జగన్ సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

ప్రస్తుతం ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ఎలా కాపాడుకోవాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం, సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని వివరించారు. ఈ సందర్భంలో రాజధాని తరలింపు అనేది ఏమంత ముఖ్యం కాదని, కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత సీఎం జగన్ నిర్ణయం మేరకు రాజధాని తరలింపు ఉంటుందని తెలిపారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానులు ప్రకటించారని, గతంలో ఒక్క రాజధాని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతమే అభివృద్ధి చెందే పరిస్థితి ఉందని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందాలని కర్నూలును న్యాయపరమైన రాజధానిగా ఏర్పాటు చేశారని, ఇప్పటికే భవనాలు ఉన్నందున అమరావతిలో శాసనపరమైన రాజధాని ఉంటుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాలనా పరమైన రాజధాని విశాఖలో నెలకొల్పారని వివరించారు.


More Telugu News