ఆంధ్రప్రదేశ్ కు ఈరోజు చీకటి రోజు.. గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరం: నక్కా ఆనంద్ బాబు

  • మూడు రాజధానులను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు
  • సాంకేతిక అంశాలను పట్టించుకోకుండా గవర్నర్ ఆమోదించారు
  • వికేంద్రీకరణను కోర్టులు ఒప్పుకోవని భావిస్తున్నాం
మూడు రాజధానుల బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో వైసీపీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. ఇదే సమయంలో విపక్ష నేతలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఈ అంశంపై స్పందిస్తూ, ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం చాలా విచారకరమని అన్నారు. అమరావతి కోసం అన్ని వర్గాల ప్రజలు దాదాపు 230 రోజుల నుంచి వివిధ రకాలుగా ఆందోళన చేస్తున్నారని... రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాజధాని విభజన, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరమని అన్నారు.

రాష్ట్ర చరిత్రలో ఇదొక విచారకరమైన రోజని ఆనంద్ బాబు చెప్పారు. వారం, పది రోజులుగా ఊహించిందే జరుగుతోందని... కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలను రేకెత్తించిందని అన్నారు. పెద్దలందరూ కలిసి అనుమానాలను ఈరోజు నిజం చేశారని చెప్పారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో కోర్టు ఎలా చీవాట్లు పెట్టిందో చూశామని... రాజధానుల అంశంలో కూడా సాంకేతికంగా చాలా సమస్యలు ఉన్నాయని... అయినప్పటికీ, వాటన్నింటినీ పట్టించుకోకుండా గవర్నర్ ఆమోదం తెలిపారని అన్నారు. అందరూ కలిసి రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ వ్యవస్థను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.

నిమ్మగడ్డ విషయంలో కోర్టుకు సమాధానాలు చెప్పినట్టే... ఈ అంశంలో కూడా న్యాయస్థానాలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని తాను భావిస్తున్నానని ఆనంద్ బాబు చెప్పారు. రాజధాని వికేంద్రీకరణను కూడా కోర్టులు ఒప్పుకోవనే ఆశాభావంలో తాము ఉన్నామని తెలిపారు.


More Telugu News