ఏపీ క్వారంటైన్ కేంద్రాల్లో క్రీడలు, సంగీతంతో కరోనా థెరపీ

  • ఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు
  • అత్యధికులు లక్షణాలు లేనివారే!
  • వారికి కొవిడ్ క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స
దేశంలో అత్యధిక కరోనా కేసులున్న టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఏపీలో ఇప్పటివరకు 1.20 లక్షల పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించాక గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీ సంఖ్యలో కేసులు వస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే, అనంతపురం జిల్లాలోనూ కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అధికారులు కరోనా రోగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు, వారిని నిత్యం ఉల్లాసంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. లక్షణాలు లేనివారే ఎక్కువ సంఖ్యలో ఉంటుండగా, వారిని కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వారికి క్రీడలు, సంగీతంతో కరోనా థెరపీ అందిస్తున్నారు. ఉదయం సుప్రభాతంతో ప్రారంభించి, ఆపై రోగులు తమకు ఇష్టమైన పాటలు వినే సదుపాయం కల్పించారు. అంతేకాదు, క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని రకాల క్రీడా ఉపకరణాలు అందుబాటులో ఉంచారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్ ఇలా అనేక క్రీడలతో అనంతపురం జిల్లా కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలు సందడిగా మారాయి.

ఈ కేంద్రాల్లో ఆన్ లైన్ సినిమాలు చూసేందుకు వీలుగా ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాప్ టాప్, ప్రొజెక్టర్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు కరోనా రోగుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా చూసేందుకు కౌన్సెలింగ్ అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.



More Telugu News