సొంత నేవిగేషన్ వ్యవస్థతో అమెరికా, రష్యాల సరసన చైనా

  • ఇప్పటికే సొంత దిక్సూచీ వ్యవస్థలు కలిగివున్న అమెరికా, రష్యా
  • బెయ్ డో నేవిగేషన్ సిస్టమ్ ప్రారంభించిన షీ జిన్ పింగ్
  • ఇది అత్యాధునికమైందంటున్న చైనా
ప్రపంచంలో అమెరికా, రష్యా వంటి అతి కొన్ని దేశాలు మాత్రమే సొంత నేవిగేషన్ వ్యవస్థలను కలిగివున్నాయి. తాజాగా అమెరికా (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్-జీపీఎస్), రష్యా (గ్లోనాస్), యూరప్ (గెలీలియో) దేశాల సరసన చైనా కూడా నిలిచింది. చైనా సొంతంగా 'బెయ్ డో' అనే దిక్సూచీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థకు దన్నుగా నిలిచే ఉపగ్రహ సమూహంలోని చివరిదైన 35వ ఉపగ్రహాన్ని చైనా ఇటీవలే రోదసిలోకి పంపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చైనా 'బెయ్ 'డో నేవిగేషన్ సిస్టమ్ కు అవసరమైన అన్ని ఉపగ్రహాలు అంతరిక్షంలో కొలువుదీరినట్టయింది.

దీనిపై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ స్పందిస్తూ, 'బెయ్ డో' నేవిగేషన్ వ్యవస్థ ప్రాజెక్టు పూర్తయిందని, తమదైన నూతన దిక్సూచీ వ్యవస్థను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు. కాగా, అమెరికా ఉపయోగిస్తున్న జీపీఎస్, యూరప్ దేశాలకు చెందిన గెలీలియో, రష్యాకు చెందిన గ్లోనాస్ కంటే తమ 'బెయ్ డో' కచ్చితమైనదని చైనా చెబుతోంది. కాగా, 'బెయ్ డో' సేవలను చైనా తన వ్యాపార భాగస్వాములైన పాకిస్థాన్ వంటి దేశాలకు కూడా అందించనుందని సమాచారం.


More Telugu News