ప్రకాశం జిల్లా మరణాలపై కారణాలు వెలికి తీయాలి: పవన్ కల్యాణ్

  • కురిచేడులో శానిటైజర్ తాగి 9 మంది మృతి
  • బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయాలన్న పవన్
  • నాటు సారా అరికట్టాలని విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్లు తాగి 9 మంది మరణించిన ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్తు కోసం నాటు సారా, శానిటైజర్ కలిపి తాగినట్టు తెలుస్తోందని, కురిచేడు మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మద్యానికి బానిసలైన వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. నాటు సారాను అరికట్టడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయం మరో గంట సేపు పొడిగించడం చూస్తుంటే ప్రభుత్వానికి మద్యనిషేధంపై చిత్తశుద్ధి లేదన్న విషయం అర్థమవుతోందని విమర్శించారు. కురిచేడులో మరణించిన వారు పేద కుటుంబాలకు చెందినవారేనని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News