శానిటైజర్‌ తాగి 9 మంది చనిపోవడం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

  • రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి
  • మద్యం ధరలను భారీగా పెంచారు
  • సారా, కల్తీ మద్యం, శానిటైజర్లు తాగుతున్నారు
  • వైసీపీ మద్యం మాఫియా ఆగడాలు పెరిగిపోయాయి
ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో మద్యానికి బానిసలైన దాదాపు 20 మంది శానిటైజర్‌ తాగగా వారిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలను భారీగా పెంచారని ఆయన విమర్శించారు. సారా, కల్తీ మద్యం, శానిటైజర్లు తాగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా పెరిగిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ మద్యం మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు.

ఇదిలావుంచితే, ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు 10 రోజులుగా శానిటైజర్‌ తాగుతున్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారని స్థానిక ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. చుట్టుపక్కల అమ్ముతోన్న శానిటైజర్లను సీజ్ చేసి పరీక్షలకు పంపుతామన్నారు. కురిచేడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.


More Telugu News