ఇదే స్ఫూర్తితో వైసీపీ సర్కారు మెలగాలి: సీపీఐ నేత రామకృష్ణ

  • ఏపీ ప్రభుత్వానికి అర్ధరాత్రి జ్ఞానోదయం కలిగింది
  • నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా తిరిగి నియమించారు
  • వివాదాస్పద అంశాలకు స్వస్తి పలికాలి
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను వైసీపీ  ప్రభుత్వం తిరిగి నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత అర్ధరాత్రి దీనికి సంబంధించిన జీవోను సర్కారు జారీ చేయడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు.

ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ప్రభుత్వానికి అర్ధరాత్రి జ్ఞానోదయం కలిగిందని చురకంటించారు. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా తిరిగి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం హర్షణీయమన్నారు. ఇతర వివాదాస్పద అంశాలకు కూడా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్వస్తి చెప్పాలని ఆయన హితవు పలికారు. ఇదే స్ఫూర్తితో వైసీపీ సర్కారు మెలగాలని వ్యాఖ్యానించారు.


మరోవైపు, రాష్ట్ర ప్రజలపై మోపిన అధిక ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కోసం భూముల విలువను విపరీతంగా పెంచారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక ధరలను విపరీతంగా పెంచారని, మద్యం షాపులు తగ్గించి, వాటి ధరలను కూడా పెంచారని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ తరహాలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News