కరోనా నేపథ్యంలో బక్రీద్ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • అనారోగ్యం బారినపడిన జంతువుల వధ వద్దన్న డబ్ల్యూహెచ్ఓ
  • కొత్త పద్ధతుల్లో శుభాకాంక్షలు చెప్పాలని సూచన
  • పెద్ద ఎత్తున గుమికూడవద్దని స్పష్టీకరణ
కరోనా నేపథ్యంలో బక్రీద్ పండుగకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతికదూరం, శానిటైజర్లు, మాస్కుల వాడకం వంటి సూచనలే కాకుండా, జంతు వధ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తను కూడా వివరించింది. అనారోగ్యం బారినపడిన గొర్రెలను, ఇతర జంతువులను వధించరాదని, అస్వస్థతతో ఉన్న జంతువులను ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఇళ్ల వద్ద జంతు వధకు స్వస్తి పలకాలని తెలిపింది.

జంతువుల నుంచి మనుషులకు కరోనా ఇతర వాహకాల ద్వారా సోకుతుందని, ఇప్పుడున్న సమాచారం మేరకు, మానవులను ఇన్ఫెక్షన్ కు గురిచేసే కరోనా వైరస్ జంతువులను కూడా ఇన్ఫెక్షన్ బారినపడేలా చేయగలదని హెచ్చరించింది. జంతువుల నుంచి నేరుగా మనుషులకు కరోనా సోకుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, అయితే, జీవాల నుంచి ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

అంతేకాదు, బక్రీద్ సందర్భంగా ఒకరినొకరు భౌతికంగా తాకే రీతిలో పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా, విభిన్న మార్గాల్లో శుభాకాంక్షలు అందజేసుకోవాలని సూచించింది. చేయి ఊపడం, హృదయంపై చేయి ఆన్చడం వంటి చర్యలతోనూ బక్రీద్ విషెస్ చెప్పవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు ఒకేచోట గుమికూడడాన్ని నివారించాలని, మసీదులు, దుకాణాలు, మార్కెట్లలో జనసందోహం ఏర్పడకుండా చూడాలని వివరించింది.


More Telugu News